Gelupu Meede (1)
Subscribe Now
భాష – వర్ణాలు – అచ్చులు – హల్లులు
ఈ వారం తెలుగు భాష యొక్క మూలాలను సరళంగా తెలుసుకుందాం. అచ్చులు, హల్లులు, వాటి విభాగాలు మరియు అర్థాలతో కూడిన జాతీయాలను ఈ పాఠంలో పరిచయం చేశాం.

సంభాషించబడేది భాష. ఇది రెండు రూపాలుగా ఉంటుంది. వాగ్రూపంలో ఉండే భాష, లిఖిత రూపంలో ఉండే భాష. తెలుగు భాషపై సంస్కృత భాష ప్రభావం అధికంగా ఉంది. అందువల్ల భాషతో పాటు వ్యాకరణం కూడా సంస్కృత వ్యాకరణంపై ఆధారపడి ఉంది.

భాషలోని సుశబ్దాలు, అపశబ్దాల పరిజ్ఞానం మనకు వ్యాకరణ శాస్త్రంతోనే కలుగుతుంది. శబ్దంలోని ప్రకృతి, ప్రత్యయములను విభజించి, వాటికి కలిగిన లోప, ఆగమ, ఆదేశాది మార్పులను తెలియజేస్తూ, శబ్దముల సాధుత్వ, సాదృశములను తెలియజేసేది వ్యాకరణం.

తెలుగు భాషలో వర్ణములు – 56.

అచ్చులు

ఇతర వర్ణములను సహాయంగా తీసుకోకుండా ఉచ్చరింపబడేవి కనుక అచ్చులను స్వరములని పిలుస్తారు. హల్లులకు ప్రాణములై ఉన్నందువల్ల ప్రాణములని కూడా పిలుస్తారు. వీటి సంఖ్య 16. ఇవి హ్రస్వములు, దీర్ఘములు అని రెండు రకాలుగా ఉంటాయి.

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ

2. హల్లులు

పొల్లు హల్లులను అచ్చులతో కలపకుండా ఉచ్చరించడం కష్టం. హల్లులకు అచ్చులు ప్రాణములు. అట్టి ప్రాణములతో కూడి ఉంటాయి కాబట్టి హల్లులను ‘ప్రాణులు’ అని, అచ్చులతో కలిసి పదార్థములను తెలియజేస్తాయి కాబట్టి ‘వ్యంజనములు’ అని పిలుస్తారు.

హల్లులు మూడు విభాగాలుగా ఉంటాయి.

అ. పరుషములు

కఠినంగా ఉచ్చరించబడేవి. ఇవి 6.
క, చ, ట, త, ప

ఆ. సరళములు

సులభంగా ఉచ్చరించబడేవి. ఇవి 6.
గ, జ, డ, ద, బ

ఒత్తులు లేకుండా శ్వాస తీసుకుంటూ పలుకబడుతూ ఉన్నందువల్ల, పరుషములు, సరళములను ‘అల్పప్రాణములు’ లేదా ‘అల్పాక్షరాలు’ అంటారు.

ఇ. స్థిరములు

పరుష, సరళములకంటే భిన్నంగా ఉండి, ప్రక్రియ వల్ల ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉండే హల్లులు. ఇవి 25.

ఖ, ఘ, జ్ఞ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, ఫ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, ఱ


2. స్వంత వాక్యాలలో ప్రయోగం

ఎ) కరతలామలకం

కరతలం అంటే అరచేయి అని, ఆమలకం అంటే ఉసిరికాయ అని అర్థం.

అరచేతిలో ఉన్న ఉసిరికాయ ఎటువంటి దాపరికం లేకుండా కళ్ల ముందు కనబడుతూ ఉంటుంది. అంటే ఒకరు వివరించి చెప్పాల్సిన అవసరం లేకుండానే తనంతట తానే స్పష్టం అయ్యే వాటికి ఉపమానంగా చెప్పబడుతుంది. మిక్కిలి స్పష్టం, సులభసాధ్యం అనే అర్థాల్లో ఈ జాతీయాన్ని వాడతారు.

ఉదాహరణలు:

  • పెరుగు చిలికితే వెన్న వస్తుందనేది పల్లె ప్రజలకు కరతలామలకం.
  • గుత్తివంకాయ కూర చేసే విధానం మా అమ్మకు కరతలామలకం.

బి) అందెవేసిన చేయి

ఒక ప్రత్యేకమైన విద్యలో ఆరితేరిన వారి చేతికి సభలో కంకణం తొడుగుతారు. ఆరితేరిన, నేర్పరి అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు.

ఉదాహరణలు:

  • అబద్ధాలు ఆడటంలో మా తమ్ముడు అందెవేసిన చేయి.
  • కీర్తనలు పాడటంలో ఆమె అందెవేసిన చేయి.

సి) మేకవన్నెపులి

పులి క్రూరజంతువు. దానికి దయాదాక్షిణ్యాలు ఉండవు. తన పని సాధించుకోవడానికి మేక మాదిరిగా స్వభావాన్ని మార్చుకుని, మెత్తని మాటలు మాట్లాడి, పని పూర్తయిన తర్వాత తన సహజగుణమైన క్రూరత్వాన్ని చూపే వారి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.

ఉదాహరణలు:

  • ఆ రాజకీయనాయకుడు పైకి ఉదారంగా మాట్లాడతాడు కానీ, నిజానికి మేకవన్నెపులి.
  • ఆమె చూడటానికి అమాయకంగా ఉంటుంది కానీ మోసం చేయడంలో మేకవన్నెపులి.

డి) కంట్లో వత్తులు వేసుకొని

నిద్రపోకుండా, ఏమాత్రం ఏమరుపాటు లేకుండా రావలసిన వాళ్ల కోసం ఎదురు చూసే వారి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.

ఉదాహరణలు:

  • అర్థరాత్రి దాటినా కృష్ణ ఇంటికి రాకపోవడంతో వాళ్లమ్మ నిద్రపోకుండా కంట్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తోంది.
  • “నీకోసం కంట్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోయావురా?”

సమానార్థక పదాలు

  1. పూవు: కుసుమము, నన, పుష్పము, అలరు, ప్రసూనము, ఫల్యము, లతాంతము, విరి, సుమము, సూనము, ప్రసవము
  2. పాము: ఉరగము, కాకోదరము, ఫణి, సర్పము, హరి, వాల్యము, పడగదారి, పన్నగము, నాగము, నాగు, నిడుదవెన్ను, భుజంగము, కుండలి, పుట్టచేర్పు, పుట్టపురుగు, సరీసృపము, సమకోలము
  3. పొగడ్త: అంకన, అగ్గింపు, అభినందనము, అభివర్ణనము, కైవారము, కీర్తనము, కొండాటము, కొనియాడుట, గడన, ధిషణ, నుతి, ప్రణుతి, ప్రణవము, ప్రశంస, ప్రస్తావన, ప్రస్తుతి, స్తోత్రము, సంస్తుతి, స్తవము, స్తువము, మెచ్చుకోలు
  4. ఆలస్యం: ఆనాయము, ఎడ, కాలహరణము, కాలక్షేపము, జంపు, జాకు, జాప్యము, జాలము, తడవు, తామసము, నట్టు, విలంబము, స్వపము, స్థాతవ్యము

వ్యతిరేకార్థక పదాలు

  • పండితుడు × పామరుడు
  • సులభము × కష్టము
  • కృతజ్ఞత × కృతఘ్నత
  • స్వతంత్రము × పరతంత్రము
  • సాపేక్ష × నిరపేక్ష, ఉపేక్ష

విప్పండి: చెప్పండి

పొడుపు కథలు

అ) తెల్లటి భూమిలో నల్లటి విత్తులు
చేతితో వేస్తారు, నోటితో ఏరుతారు

ఆ) చెరువంత గొంగడి, మీ నాయన కప్పలేడు, మా నాయన కప్పలేడు

ఇ) నూరుగురు అన్నదమ్ములకు ఒక్కటే మొలతాడు

ఈ) పచ్చని రవికెది, పదహారు పండ్లది, నవ్వుతే తెస్తాము, నవ్వకపోతే తేము

పై పొడుపు కథలకు సరైన సమాధానాలు కనుగొని comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *