1. కింది పద్యాన్ని ఔచిత్య సౌందర్య దృష్టితో విశ్లేషించండి
అనిమిషకాంతయున్ నవలతాంత విభూషణ లీల నల్లన
ల్లన వనకేళి లాలస విలాసగతిం జనుదెంచి ముందటం
గనియె మహాముని ప్రవరుఁ గౌశిక గౌశిక చిత్తభీతి సం
జనన మహాతపశ్చరణ సంయతచిత్తు నిరస్త చిత్తజున్
అనిమిషకాంతయున్ నవలతాంత విభూషణ లీల నల్లన
ల్లన వనకేళి లాలస విలాసగతిం జనుదెంచి ముందటం
గనియె మహాముని ప్రవరుఁ గౌశిక గౌశిక చిత్తభీతి సం
జనన మహాతపశ్చరణ సంయతచిత్తు నిరస్త చిత్తజున్
ప్రతిపదార్థం
- అనిమిషకాంతయున్ = దేవవనిత అయిన మేనకయు
- నవ, లతాంత, విభూషణ, లీలన్ = క్రొత్తవైన పూల అలంకారాల విలాసంతో
- అల్లనన్ + అల్లనన్ = మెల్లమెల్లగా
- వనకేళి, లాలస, విలాస, గతిన్ = వనంలో విహరించే కోరికతో వచ్చిన కులుకు నడకతో
- చనుదెంచి = వచ్చి
- ముందటన్ = ఎట్టెదుట
- మహత్ + ముని ప్రవరున్ = గొప్ప మునులలో శ్రేష్ఠుడిని
- కౌశిక, చిత్త, భీతి, సంజనన, మహత్ + తపస్ + చరణ, సంయత చిత్తున్ = ఇంద్రుడి మనస్సులో భయం పుట్టించే గొప్పదైన తపస్సు చేయటంలో నియతి గల మనస్సు గల వాడిని
- నిరస్త చిత్తజున్ = మన్మథుడిని తిరస్కరించగలిగిన వాడిని
- కౌశికున్ = కౌశిక వంశానికి చెందిన విశ్వామిత్రుని
- కనియెన్ = చూసింది
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతం, చతుర్థాశ్వాసం లోని దుష్యంతచరిత్ర లోనిది.
తాత్పర్యం
మేనక క్రొత్తవైన పూల అలంకారాల విలాసంతో మెల్లమెల్లగా వనంలో విహరించే కోరికతో కులుకుతూ నడుస్తూ వచ్చి, ఇంద్రుని భయోత్పాతుడిని చేయగల గొప్ప తపస్సు చేయటంలో నియతమైన మనస్సు కలవాడు, మన్మధ భావాన్ని జయించిన వాడు అయిన విశ్వామిత్రుడిని చూసింది.
రెప్పపాటు లేకుండా విశ్వామిత్రుడిని చూడటం వల్ల మేనకకు అనిమిషత్వం సార్థకమైందని కవి చమత్కారం. కౌశిక శబ్దాన్ని విశ్వామిత్ర పరంగానూ, ఇంద్ర పరంగానూ వాడటం విశేషం. చల్లని పిల్లగాలిని వెంటబెట్టుకొని విశ్వామిత్రుని మనస్సును గెలవటానికి ఇంద్రుని ఆదేశంపై దివి నుండి దిగిన మేనక హావభావాలను రసోచితంగా వర్ణించాడు కవి.
విశ్వామిత్రుడు మహాముని, రాజర్షి, ఇంద్రుడినే భయపెట్టగలిగిన తపస్సంపన్నుడు. అటువంటి విశ్వామిత్రుడిని సమ్మోహితుడిని చేయడానికి ఆమె అద్దుకున్న అలంకారాలు, కులుకులు వంటి హంగులు ఆమె నిర్వహించబోయే పాత్రకు తగినవిగా ఉన్నాయి.
ప్రసన్న శబ్దం ప్రసాద గుణ శోభితం. ప్రయోజనకరమైన పద ప్రయోగం ప్రసాద గుణం. దీన్ని కథాకథనానికి అన్వయిస్తే, పాఠకుని మనోవీధిలో హత్తుకొని ఆ దృశ్యం కళ్లముందు రూపు కట్టినట్లు చేయడం ప్రసన్న కథా కలితార్థం.
నన్నయ ఉత్తమ కథకుడు, కథాకథన శిల్ప పారగుడు. మేనక విశ్వామిత్రుని తపోభంగ యత్నానికి ప్రయత్నించిన సందర్భంలో చుట్టూ పరిమళించే మలయమారుతం, ఆమె అలంకరించుకున్న క్రొత్త పూల అలంకారాల నెత్తావులు, ఆమె కదలికల హొయలు విశ్వామిత్రుడిని విభ్రముడిని చేస్తాయని పాఠకుడు ఊహించుకోగలుగుతాడు.
కథలో ఏ అంశం ఎక్కడ చెబితే రక్తికడుతుందో, రసోన్మీలనం జరుగుతుందో అటువంటి ఔచిత్య పోషణకు తన శైలిలో పెద్దపీట వేసిన కవి నన్నయ.
2. UGC NET – 10 Question & Answers
అ. నన్నయ భారత కృత్యారంభ స్తోత్రం ఏ వృత్తంలో ఉంది?
జ. శార్దూల వృత్తం
ఆ. హరివంశం పూర్వభాగంలో ఆశ్వాసాలెన్ని?
జ. 9 ఆశ్వాసాలు, 2044 పద్యాలు
ఇ. ప్రసన్నరాఘవం నాటక కర్త ఎవరు?
జ. కొక్కొండ వెంకటరత్నం పంతులు
ఈ. ప్రసిద్ధ పదాలతో సులభంగా అర్థాన్ని పాఠకునికి స్ఫురింపజేసే రచనలోని గుణం?
జ. ప్రసాద గుణం
ఉ. వ్యావహారిక భాషలో రచింపబడిన వచన గ్రంథం ఏది?
జ. రాయవాచకము
ఊ. స్వరోచి, మనోరమల వృత్తాంతాన్ని వర్ణించే ప్రబంధం ఏది?
జ. మనుచరిత్ర
ఎ. భాగవతంలో కుచేలుని భక్తి ఏ మార్గం కిందికి వస్తుంది?
జ. సఖ్యభక్తి
ఏ. ‘పని’ అనే పదానికి ప్రాచీన శాసన రూపం ఏది?
జ. పణి
ఐ. తెలుగులో తొలి యక్షగానం ఏది?
జ. సౌరభీయ చరిత్ర
ఒ. మారన రచించిన కావ్యం ఏది?
జ. మార్కండేయ పురాణం
3. UGC NET Exercise – 10 Questions
ఈ కింది ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ రూపంలో రాయండి
- ఆంధ్రప్రశస్తి కావ్యకర్త ఎవరు?
- ఆంధ్రుల గురించి ప్రస్తావించిన అశోకుని శిలాశాసనం ఏది?
- దాసర్లు తలపై పెట్టుకొని తిరిగే భిక్షాపాత్రను ఏమని పిలుస్తారు?
- అర్థసందిగ్ధత అంటే ఏమిటి?
- భర్తృహరి రచించిన సుభాషితాలను ఆంధ్రీకరించిన కవి ఎవరు?
- సి. నారాయణరెడ్డిగారి ఏ గ్రంథానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది?
- “అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయింబడతేర” అనే పద్యం ఎందులోనిది?
- శ్రీశ్రీ మరోప్రస్థానం మొదట వెలువడిన సంవత్సరం ఏది?
- ‘అచ్చోటు’ – ఏ సంధి?
- ప్రస్తుతం భారతదేశంలో వ్యవహారంలో లేని ద్రావిడ భాష ఏది?